శ్రీ శ్రీ గురువాష్టకం - మంగళ హారతి

(శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు విరచితము)

    17 వ, శతాబ్దపు మధ్యకాలములో ఆవిర్భవించిన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు, కృష్ణ చైతన్యమునకు సంబంధించిన గురుపరంపరలోని గొప్ప వైష్ణవ ఆచార్యుడు. ఆయన ఈ విధముగా తెలిపారు, "ఎవరైతే బ్రహ్మముహూర్త సమయాన గురుదేవుని ఉద్దేశించి ఈ సుందరమైన ప్రార్థనను అత్యంత శ్రద్ధతో గొంతెత్తి స్తుతిస్తారో వారు మరణాంతరము వృందవనేశ్వరుడైన శ్రీ కృష్ణునికి స్వయముగా సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు."


(1) సంసారదావానలలీఢలోక-

త్రాణాయ కారుణ్యఘనాఘనత్వమ్ 

ప్రాప్తస్య కల్యాణగుణార్ణవస్య

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(2) మహాప్రభోః కీర్తననృత్యగీత-

వాదిత్రమద్యన్మనసో రసేన 

రోమాంచకంపాశ్రుతరంగభాజో

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(3) శ్రీవిగ్రహారాధననిత్యనానా-

శృంగారతన్మన్దిరమార్జనాదౌ 

యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోఽపి

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(4) చతుర్విధ  శ్రీభగవత్ ప్రసాద-

స్వాద్వన్నతృప్తాన్ హరిభక్తసంఘాన్ 

కృత్వైవ తృప్తిం భజతః సదైవ

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(5) శ్రీరాధికామాధవయోరపార-

మాధుర్యలీలాగుణరూపనామ్నామ్

ప్రతిక్షణాస్వాదనలోలుపస్య

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(6) నికుంజయూనో రతికేళిసిద్ధ్యై

యా యాలిభిర్యుక్తిరపేక్షణీయా

తత్రాతిదాక్ష్యాదతివల్లభస్య

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(7) సాక్షాద్ధరిత్వేన సమస్తశాస్త్రై-

రుక్తస్తథా భావ్యత ఏవ సద్భిః 

కింతు ప్రభోర్యః ప్రియ ఏవ తస్య

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(8)యస్య ప్రసాదాద్ భగవత్ప్రసాదో

యస్యాప్రసాదాన్న గతిః కుతోఽపి 

ధ్యాయన్ స్తువంస్తస్య యశస్త్రిసన్ధ్యం

వందే గురోః శ్రీచరణారవిందమ్ 


(1) శ్రీ గురుదేవులు కరుణాసాగరము నుండి వరములను పొందుచున్నారు. మేఘము వర్షించి కార్చిచ్చును ఆర్పునట్లుగానే  శ్రీ గురుదేవులు సంసార మనెడు కార్చిచ్చును ఆర్పి భౌతిక దుఃఖములతో బాధపడుచున్న జగత్తును విముక్తి గావించుచున్నారు. అటువంటి కళ్యాణగుణసాగరుడైన  శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

(2)భగవంతుని దివ్యనామాలను కీర్తిస్తూ, ఆనంద పారవశ్యముతో నృత్యము చేస్తూ, గీతాలను పాడుతూ, సంగీత వాయిద్యములను మ్రోగిస్తూ శ్రీ గురుదేవులు ఎల్లప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క సంకీర్తనోద్యమము పట్ల హర్షాతిరేకముతో ఉందురు. వారు తమ హృదయము నందు విశుద్ధ భక్తిరసాలను ఆస్వాదించుటచేత అప్పుడప్పుడు వారి రోమములు నిక్కబొడుచును, శరీరము కంపించును మరియు నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించును. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

(3) శ్రీ గురుదేవులు మందిరములో నిత్యము శ్రీ శ్రీ రాధాకృష్ణుల ఆరాధనలో నిమగ్ను లై ఉందురు మరియు అతడు వారి శిష్యులను కూడా అటువంటి ఆరాధనలో నిమగ్నులను చేయును. వారు అందమైన వస్త్రాలతో ఆభరణాలతో శ్రీ మూర్తులను అలంకరించుదురు, మందిరమును పరిశుభ్ర పరుచుదురు. ఈ విధముగా శ్రీ కృష్ణుని వారు వివిధ రకములగా ఆరాధించుదురు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

(4)  శ్రీ గురుదేవులు, సదా శ్రీ కృష్ణునికి నాలుగు రకాలైన (చీకబడేవి, చప్పరింపబడేవి, త్రాగబడేవి మరియు పీల్చబడేవి) రుచికరమైన ఆహార పదార్థములను అర్పించుదురు. భక్తులు భగవత్ ప్రసాదమును గ్రహించి తృప్తి చెందినప్పుడు శ్రీ గురుదేవులు సంతృప్తి చెందుదురు.  అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

(5)  శ్రీ గురుదేవులు, శ్రీ శ్రీ రాధామాధవుల యొక్క అనంత గుణ, నామ, రూప మరియు మధుర లీలలను వినుటకు లేదా కీర్తించుటకు ల్లపుడు ఉత్సాహముతో ఉందురు. వారు ప్రతిక్షణము వీటిని ఆస్వాదించాలనీ ఆకాంక్షిస్తుందురు.  అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

(6)   శ్రీ గురుదేవులు వృందావన కుంజములలో శ్రీ శ్రీ రాధాకృష్ణుల మాధుర్య లీలల పరిపూర్ణతకు వివిధ ఏర్పాట్లు చేయు గోపికలకు సహాయము చేయుటలో నిపుణులగుట వలన , వారు రాధాకృష్ణులకు అత్యంత ప్రీతిపాత్రులు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

(7)   శ్రీ గురుదేవులు భగవంతునికి పరమ ఆంతరంగిక సేవకులగుటచేత , వారిని భగవంతుని వలెనే గౌరవించవలెను. ఈ విషయాన్ని సకల శాస్త్రములు మరియు ప్రామాణిక సాధువులందరూ కూడా ధ్రువీకరించారు. అటువంటి శ్రీ హరి ప్రామాణిక  ప్రతినిధియైన శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

(8)   శ్రీ గురుదేవులు కృప వలన శ్రీ కృష్ణ భగవానుని కృపను పొందగలము. వారి కృప లేకుండా ఎవరు భక్తిమార్గమున ప్రగతిని సాధించలేరు. కాబట్టి త్రిసంధ్యలలో (ఉదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము) శ్రీ  గురుదేవులను స్మరిస్తూ స్తుతించవలెను. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.